మహాబలిపురం రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిసిన విజయ్ – ఓదార్చిన టీవీకే చీఫ్


తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కజగం (టీవీకే) ఇటీవల తీవ్రమైన విషాద ఘటనను ఎదుర్కొంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడగా, ఆ వెంటనే విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించి, వారి పట్ల సానుభూతి చూపారు.

ఆ సమయంలోనే విజయ్ వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి, త్వరలోనే ప్రత్యక్షంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి, తాజాగా చెన్నై సమీపంలోని మహాబలిపురం రిసార్ట్‌లో వారిని కలుసుకున్నారు. ఈ సమావేశం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను కరూర్‌ నుంచి చెన్నైకి తరలించారు. టీవీకే పార్టీ రిసార్ట్‌లో 50 గదులను బుక్ చేసి, బాధితులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా విజయ్ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంతో మాట్లాడి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారిని ఓదార్చి, పార్టీ తరఫున అందించే సహాయ చర్యలపై వివరాలు అందించారు. తనపై చూపుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అయితే, బాధితులలో కొందరు విజయ్ చెన్నైకి పిలిపించుకుని కలుసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “మా ఇళ్లకు వచ్చి పరామర్శిస్తారని భావించాం. కానీ మమ్మల్ని రిసార్ట్‌కి పిలిపించడం తగదని అనిపించింది,” అని కొందరు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది రాజకీయ పరామర్శ కంటే ప్రైవేట్ ఈవెంట్‌లా అనిపించిందని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇకపోతే, టీవీకే వర్గాలు మాత్రం “విజయ్ రక్షణ, భద్రత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని” స్పష్టం చేశాయి. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి విజయ్ పేరు చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *