ప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జెనరేషన్ జెడ్ (Gen-Z) లో మద్యపాన అలవాటు గణనీయంగా తగ్గుతోంది. ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తున్న కొత్త తరం, మద్యం పట్ల తమ దృక్పథాన్ని మార్చుకుంటోంది. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం, మద్యపానం చేయడానికి చట్టబద్ధ వయస్సులో ఉన్న ప్రతి ముగ్గురు యువతలో ఒకరు (36%) ఇప్పటివరకు ఆల్కహాల్ తాగలేదని తేలింది. ఇది యువతలో మారుతున్న జీవనశైలిని ప్రతిబింబిస్తుంది.
ఈ నివేదిక ప్రకారం, 87 శాతం మంది ఆరోగ్యకరమైన జీవితం కోసం మద్యం నుంచి దూరంగా ఉన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారించడమే ప్రధాన కారణం కాగా, 30 శాతం మంది డబ్బు ఆదా చేసుకోవడానికి, 25 శాతం మంది నిద్ర నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి మద్యాన్ని వదిలేస్తున్నారని వివరించింది. గత ఐదేళ్లలో మద్యం వినియోగంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది — 2020లో వారానికి ఒకసారి తాగేవారు 23 శాతం ఉండగా, 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది.
ఇక, ఇప్పటికే మద్యం సేవించే వారిలో కూడా మార్పు కనిపిస్తోంది. 53 శాతం మంది తమ ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 44 శాతం మాత్రమే. యువతలో ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న ‘జీబ్రా స్ట్రైపింగ్’ అనే కొత్త ట్రెండ్ ఈ మార్పుకు ప్రధాన కారణమవుతోంది. ఇది ఒక సోషల్ డ్రింకింగ్ పద్ధతి, అందులో వ్యక్తులు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకున్న తర్వాత తదుపరి రౌండ్‌లో నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకుంటారు. ఈ విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకోవడమే కాకుండా, సామాజిక ఉత్సవాల్లో కూడా భాగస్వామ్యం కావచ్చు.
అయితే ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం తగ్గుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో దేశంలో ఆల్కహాల్ వినియోగం భారీగా పెరగనుందని రిపోర్ట్ చెబుతోంది. 2024 నుండి 2029 మధ్య కాలంలో 357 మిలియన్ లీటర్ల ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం పెరగవచ్చని అంచనా, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి.
మరోవైపు, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. 2024లో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ కేవలం 0.6 శాతం వృద్ధి చెంది 1.7 ట్రిలియన్ డాలర్లు చేరగా, నాన్-ఆల్కహాలిక్ స్పిరిట్స్ 17 శాతం, నాన్-ఆల్కహాలిక్ బీర్ 11 శాతం, నాన్-ఆల్కహాలిక్ వైన్ 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రానున్న ఐదేళ్లలో (2025–2029) ఈ మార్కెట్ 24 శాతం వృద్ధి సాధించనున్నట్లు అంచనా.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మద్యం పట్ల యువత దృక్పథం మారడం సాంఘికంగా కూడా సానుకూల పరిణామమే. ‘జీబ్రా స్ట్రైపింగ్’, ‘సోబర్ క్యూటియాసిటీ’, ‘మాక్‌టైల్స్’ వంటి ట్రెండ్లు రాబోయే దశాబ్దంలో మరింత ప్రాచుర్యం పొందనున్నాయని చెబుతున్నారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆర్థిక భద్రతల మేళవింపుతో యువత కొత్త జీవనశైలిని ఎంచుకుంటోంది.

 
				
			 
				
			