చెన్నై కేంద్రంగా సంచలనం రేపిన మత్తుపదార్థాల కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజా పరిణామంలో ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
గత జూన్ నెలలో చెన్నైలో ఘనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు మరియు సమాచారం సేకరించారు. ఆ దర్యాప్తులో భాగంగా అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్, నటులు శ్రీకాంత్, కృష్ణ సహా పలువురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన తర్వాత అక్రమ నగదు లావాదేవీలు కూడా జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవడంతో ఈడీ ఆగస్టు నెలలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం శ్రీకాంత్, కృష్ణ బెయిల్‌పై బయట ఉన్నారు. మరోవైపు ఇతర నిందితులు పుళల్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
తాజాగా ఈడీ అధికారులు పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్ కుమార్‌లను ప్రత్యేక కోర్టు అనుమతితో విచారించారు. వారివద్ద నుంచి కీలకమైన ఆర్థిక లావాదేవీల వివరాలు, సంబంధిత ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఆ వివరాల ఆధారంగా నటులు శ్రీకాంత్ మరియు కృష్ణను వ్యక్తిగతంగా విచారించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నెల 28న శ్రీకాంత్, 29న కృష్ణ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. వీరి నుంచి మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విచారణ తర్వాత కేసులో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
