మంగళగిరి మండల పరిధిలో కాలేజీ యువకులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
గ్రామీణ సీఐ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాజా గ్రామంలో యువకులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందిన వెంటనే నిఘా ఉంచి, నంబూరు కెనాల్ వద్ద 9 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో గంజాయి విక్రయానికి ఉపయోగించిన స్కూటీ, 95 వేల విలువైన 1.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశాలోని ఇచ్చాపురం కొండ ప్రాంతాల నుంచి చిలకలపూడి భాను ప్రసాద్ అనే వ్యక్తి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయి విక్రయించేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, వరుసగా మూడు కేసులు నమోదు అయితే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు.