భారత్–చైనా విమాన రాకపోకలకు కొత్త ఊపు – ఢిల్లీ–షాంఘై సర్వీసులు పెంపు, ముంబై–కోల్‌కతాకు విస్తరణ యోచన


భారత్ మరియు చైనా మధ్య విమాన సర్వీసులు తిరిగి పుంజుకుంటున్నాయి. కరోనా అనంతర కాలంలో క్రమంగా పునరుద్ధరించబడుతున్న అంతర్జాతీయ రాకపోకల్లో భాగంగా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ–షాంఘై మార్గంలో సర్వీసులను గణనీయంగా పెంచనుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది నవంబర్ 9న తిరిగి ప్రారంభమవుతున్న ఈ సర్వీసులు, వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మరింత విస్తరించనున్నాయి.

ఇప్పటి వరకు వారానికి మూడు సర్వీసులు మాత్రమే నడుస్తుండగా, వాటిని ఐదుకు పెంచే నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్‌ నుంచి పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం, ఢిల్లీ నుంచి బయలుదేరే విమానం (MU564) రాత్రి 7:55 గంటలకు టేకాఫ్‌ చేసి, మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు షాంఘై చేరుకుంటుంది. షాంఘై నుంచి బయలుదేరే విమానం (MU563) మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:45 గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ఈ సేవలు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నడుస్తాయి.

ఈ రూట్‌లో 17 బిజినెస్ క్లాస్, 245 ఎకానమీ క్లాస్ సీట్లు కలిగిన ఆధునిక ఎయిర్‌బస్ A330-200 వైడ్-బాడీ విమానాలను ఉపయోగించనున్నారు. భారత్‌లో ఈ సర్వీసులకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్, సేల్స్ కార్యకలాపాలను ఇంటర్‌గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ నిర్వహిస్తుంది. అదనంగా, కున్మింగ్–కోల్‌కతా మరియు షాంఘై–ముంబై మార్గాల్లో కూడా కొత్త సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉందని సంస్థ వెల్లడించింది.

ఈ విస్తరణతో భారత్–చైనా మధ్య పర్యాటకం, విద్య, వ్యాపారం మరియు సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని చైనా ఈస్టర్న్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల క్రితం నిలిచిపోయిన ఈ మార్గంలో 2019లో సుమారు 2,588 షెడ్యూల్డ్ విమానాలు నడిచినట్లు OAG ట్రావెల్ డేటా ప్రొవైడర్ గణాంకాలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉంటే, భారత విమానయాన సంస్థ ఇండిగో కూడా తాజాగా చైనాకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇటీవల కోల్‌కతా నుండి 180 మంది ప్రయాణికులతో గ్వాంగ్‌జౌ చేరుకున్న తొలి ఇండిగో ఫ్లైట్‌కు చైనా ఘనస్వాగతం పలికింది. 2020 తర్వాత ఇరు దేశాల మధ్య ఇదే తొలి డైరెక్ట్ ఫ్లైట్ కావడం విశేషం. నవంబర్ 10 నుంచి న్యూఢిల్లీ–గ్వాంగ్‌జౌ మధ్య రోజువారీ డైరెక్ట్ విమానాలను కూడా నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది.

భారత్–చైనా మధ్య విమాన సర్వీసులు పెరగడం వాణిజ్యం, విద్యార్థుల రాకపోకలు, టూరిజం రంగాలపై అనుకూల ప్రభావం చూపుతుందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య గగనతల మార్గాల్లో ఈ కొత్త పరిణామం, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కీలక మలుపు కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *