దక్షిణాసియా ప్రాంత రాజకీయాల్లో కీలక పరిణామానికి వేదికగా మారబోతోంది భారత్-ఆఫ్ఘానిస్తాన్ సంబంధాలు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌ను కబ్జా చేసిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ నెల అక్టోబర్ 9న భారత పర్యటనకు రానున్నారు. ఇది కేవలం సాధారణ పర్యటనగా కాకుండా, ప్రాంతీయ శాంతి, భద్రతా పరంగా కీలక మలుపుగా భావిస్తున్నారు.
ముత్తాఖీ పర్యటనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పెషల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆయనపై అమలులో ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది, దీని వల్ల ఆయన అక్టోబర్ 9 నుండి 16 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అక్టోబర్ 10న భారత్-ఆఫ్ఘాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ భేటీ కోసం గత జనవరి నుంచి భారత ప్రభుత్వం గోప్యంగా చర్చలు జరుపుతుండటం విశేషం.
ఈ భేటీ పాకిస్థాన్‌కు భారీ దౌత్య పరాజయంగా భావిస్తున్నారు. గతంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్న తాలిబన్, ఇప్పుడు భారత ఉగ్రవాద నిరోధక చర్యలకు మద్దతు తెలుపుతోంది. ఇటీవల పాకిస్థాన్ పై భారత్ జరిపిన **”ఆపరేషన్ సిందూర్”**కు తాలిబన్లు బహిరంగంగా మద్దతు తెలపడం, ఆ దేశ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ నేరుగా ఫోన్ సంభాషణ జరిపిన ఘటనలు దీనికి నిదర్శనాలు.
అంతేకాదు, కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని భారత్ హర్షించింది. ఇది భారత్-ఆఫ్ఘాన్ మధ్య పెరుగుతున్న భద్రతా సహకారాన్ని సూచిస్తోంది. దీనికి తోడు, మానవతా దృక్పథంలోనూ భారత్ ఆఫ్ఘాన్‌కు పక్కన నిలుస్తోంది.
తాజాగా ఆఫ్ఘానిస్తాన్‌లో సంభవించిన భూకంప సమయంలో 1000 టెంట్లు, 15 టన్నుల ఆహార సరఫరా, 21 టన్నుల మందులు వంటి సాయం అందించింది. గతంలో కూడా 50,000 టన్నుల గోధుమలు, వందలాది టన్నుల మందులు, వ్యాక్సిన్లు పంపిన భారత ప్రభుత్వం, తాలిబన్ పాలిత ఆఫ్ఘానిస్తాన్‌లో మానవీయ స్పర్శను కొనసాగిస్తోంది.
ఇకపోతే పాకిస్థాన్‌తో ఆఫ్ఘాన్ సంబంధాలు తీవ్రంగా దిగజారిన తరుణంలో, భారత్ తమదైన భద్రతా వ్యూహం అమలు చేస్తోంది. ఇటీవల పాక్ 80,000 మందికి పైగా ఆఫ్ఘాన్ శరణార్థులను వెనక్కి పంపడంతో తాలిబన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ ఖాళీని భారత్ సద్వినియోగం చేసుకుంటూ తాలిబన్‌తో నేరుగా సంబంధాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇది చైనా, పాకిస్థాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ వేసిన వ్యూహాత్మక అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ముత్తాఖీ పర్యటన కేవలం భవిష్యత్ ద్వైపాక్షిక సంబంధాలే కాక, ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా చూస్తున్నారు.