బ్రహ్మోస్ ఒప్పందం దిశగా భారత్–ఇండోనేషియా

India and Indonesia set to finalize BrahMos missile defence deal pending Russia’s approval brahmos missile

భారత్ మరియు ఇండోనేషియా మధ్య “బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి” కొనుగోలు ఒప్పందం తుది దశకు చేరుకుంది. రష్యా నుంచి చివరి ఆమోదం అందగానే ఈ ప్రధాన రక్షణ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే రెండు దేశాల మధ్య పలు దఫాల చర్చలు పూర్తయ్యాయి. ఆమోదం లభిస్తే భారత్ రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ముగించినట్లవుతుంది.

 ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియా లక్ష్యం

2023 ఏప్రిల్‌లో భారత్  ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ ఒప్పందం  కుదుర్చుకుంది. ఆ ఒప్పందం కింద భారత్ మూడు క్షిపణి బ్యాటరీలను ఫిలిప్పీన్స్‌కు అందించింది.290 కిలోమీటర్ల పరిధి, మాక్ 2.8 వేగం  కలిగిన ఈ బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్‌ను ఫిలిప్పీన్స్ తీర రక్షణలో మోహరించింది.

విజయవంతమైన అమలుతో ప్రేరణ పొందిన ఇండోనేషియా ఇప్పుడు భారత్ నుంచి బ్రహ్మోస్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది.

 ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి

బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశంలోని  రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), రష్యా NPO మాషినోస్ట్రోయెనియా తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి.


అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని తాకగల ఈ క్షిపణి భూమి, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. శత్రు రాడార్లకు దొరకకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత.

ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర

ఇటీవలి కాలంలో భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్లో”  బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి ఘోర నష్టం కలిగించిందని సమాచారం.


దీంతో ప్రపంచ దేశాల దృష్టి మళ్లీ ఈ శక్తివంతమైన క్షిపణిపై నిలిచింది. ఇండోనేషియా ఒప్పందం తుది దశకు చేరుకోవడం ద్వారా భారత్ రక్షణ రంగంలో మరో అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *