బెంగళూరు నగరాన్ని ఊపిరాడనివ్వని ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు దశాబ్దాలుగా వాయిదా పడుతున్న పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) ప్రాజెక్టును ‘బెంగళూరు బిజినెస్ కారిడార్’గా పునర్నామకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ కారిడార్‌ను 117 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు నగరంలోని ట్రాఫిక్‌ను 40 శాతం తగ్గించగలదని అంచనా. హైవేలు మరియు పారిశ్రామిక ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనాలకు నగరంలోకి ప్రవేశం లేకుండా, నేరుగా వెళ్ళే అవకాశం కల్పించనుంది. తద్వారా నగరానికి ట్రాఫిక్, కాలుష్యం రెండింటి నుండి ఉపశమనం లభించనుంది.
భూసేకరణలో 1,900 కుటుంబాలు ప్రభావితమవుతాయని అంచనా వేయబడింది. వారికి న్యాయం చేయడం కోసం ఐదు రకాల పరిహార ఆప్షన్లు అందుబాటులో ఉంచినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. నగదు పరిహారం, టీడీఆర్, ఎఫ్ఏఆర్, అభివృద్ధి చేసిన లేఅవుట్ ప్లాట్లు వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. రైతులు భూమి రూపంలో పరిహారాన్ని కోరడంతో ప్రాజెక్టు వ్యయం రూ.27,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ప్రాజెక్టును బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) అమలు చేయనుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు, పారిశ్రామిక, వాణిజ్య వృద్ధికి తోడ్పడి, బెంగళూరును ఒక ప్రఖ్యాత పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం.