బెంగళూరులో దారుణమైన లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూసింది. 21 ఏళ్ల యువతి తన చర్మవ్యాధి చికిత్స కోసం క్లినిక్‌కు వెళ్లినప్పుడు 56 ఏళ్ల డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ అరగంట పాటు పరీక్ష పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం, యువతి శనివారం సాయంత్రం ఒంటరిగా క్లినిక్‌కు వచ్చారు. సాధారణంగా ఆమె తండ్రి తో వచ్చేవారు, కానీ ఆ రోజు తండ్రికి వీలు కాలేదు.
ఆ అవకాశాన్ని ఉపయోగించి, డాక్టర్ యువతిని లైంగికంగా వేధించారని, దుస్తులు విప్పమని, ముద్దులు పెట్టారని, హోటల్ రూమ్‌లో గడుపుదామంటూ ప్రతిపాదనలు చేసినట్టు ఆమె ఫిర్యాదులో వివరించింది. యువతి ప్రతిఘటించినా, డాక్టర్ వినకుండా తన అసభ్య ప్రవర్తన కొనసాగించాడని పేర్కొన్నారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే బాధితురాలి కుటుంబం, స్థానికులు క్లినిక్ వద్దకు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని డాక్టర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ ప్రవీణ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, “నేను కేవలం వైద్య పరీక్ష మాత్రమే చేశాను, యువతి అపార్థం చేసుకున్నది” అని వాదించారు. అయినప్పటికీ, పోలీసులు భారతీయ న్యాయసంహిత (IPC) సెక్షన్లు 75, 79 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ ఘటన సిటీని షాక్‌లో ఉంచగా, మహిళల భద్రతకు సంబంధించిన చర్చలు మరోసారి ప్రజా మాధ్యమాల్లో జోరుగా సాగుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం కోసం సదుపాయం పొందే వరకు ఇలాంటి ఘటనలను నిర్లక్ష్యం చేయరాదు అని తెలిపారు.