కర్ణాటక మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ (72) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఛాతీ, పొట్టపై తీవ్ర కత్తిపోట్లు ఉండటంతో ఇది ఉద్దేశపూర్వక దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ హత్యలో ప్రధాన నిందితురాలిగా ఆయన భార్య పల్లవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తె కృతిని కూడా విచారిస్తున్నారు. కుమారుడు కార్తీక్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓం ప్రకాశ్‌కు, పల్లవికి మధ్య ఆస్తి వివాదం ఉందని సమాచారం. అయితే పల్లవి గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా సమస్యతో బాధపడుతోందని, ఆ కారణంగా మానసిక స్థితి అస్థిరంగా ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పల్లవి గతంలోనూ భర్త తనను చంపేస్తాడని, తుపాకీతో బెదిరిస్తున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ భయపడేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పల్లవి భర్త ముఖంపై కారం చల్లిందని, అతన్ని కట్టేసి పదునైన కత్తులతో పలుమార్లు పొడిచిందని, చివరికి గాజు సీసాతో దాడి చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులు సాయంత్రం 4:30కి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది కుటుంబ అంతర్గత వ్యవహారంగానే అనుమానిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఓం ప్రకాశ్, 2015లో కర్ణాటక రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అతని మృతిపై పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
