బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడలూరు జిల్లాలో కుండపోత వాన కారణంగా ఓ ఇల్లు కూలిపోయి ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
వాతావరణ శాఖ చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు కూడా అత్యంత భారీ వర్షాల బారిన పడే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదనంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వాతావరణ అధికారులు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వర్షాల దెబ్బకు తమిళనాడు ప్రభుత్వం విపత్తు నిర్వహణ చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి, పరిస్థితులను పర్యవేక్షించేందుకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయక శిబిరాలు, కమ్యూనిటీ కిచెన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. చెంగల్‌పట్టు కలెక్టర్ డి. స్నేహ మాట్లాడుతూ, “వర్షాలకు ముందుగానే పూడికతీత పనులు పూర్తి చేశాం. నీరు నిల్వ ఉండకుండా పంపింగ్ యంత్రాలు, సహాయక సిబ్బంది సిద్ధంగా ఉన్నారు” అని తెలిపారు.
భారీ వర్షాల ప్రభావంతో తమిళనాడులోని 13 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తుకుడి, తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో వరి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
వాతావరణ శాఖ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించింది. రాబోయే రెండు రోజులలో తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.