ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహం – నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్‌!


తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మళ్లీ చెలరేగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది.

గతంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే అక్టోబర్ 13 నుంచే బంద్‌ చేపట్టాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. అయితే, ముఖ్యమంత్రి సలహాదారు వే. నరేందర్ రెడ్డితో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం దీపావళిలోపు రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ భరోసా ఆధారంగా కాలేజీ యాజమాన్యాలు తాత్కాలికంగా బంద్ నిర్ణయాన్ని వాయిదా వేశాయి.

కానీ పండగ పూర్తయినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. దీంతో, “ఇక సహనం లేదు” అంటూ ఆదివారం సమావేశమైన ‘ఫాతీ’ కార్యవర్గం, సమగ్రంగా బంద్ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అక్టోబర్ 22న తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రభుత్వానికి బంద్ నోటీసు రూపంలో అందజేయనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఈ బంద్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్న వేల కాలేజీలు పాల్గొననున్నాయి. విద్యార్థులపై బంద్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో, ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాన్ని తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.

విద్యాసంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ – “ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడం బాధాకరం. ఏటా కోట్లు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నాము. కానీ బకాయిలు రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతోంది. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే, బంద్‌ను మరింత తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *