పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆందోళన చెలరేగింది.
ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను దిగిపోవాలని సూచించారు. కొద్ది సేపట్లో మంటలు చెలరేగినా, అందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై రాష్ట్ర మంత్రి సంధ్యారాణి స్పందించారు.
ఆమె అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అగ్నిమాపక వాహనాన్ని అక్కడికి పంపించి, ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
