చైనాకు చెందిన మానవ సహిత అంతరిక్ష కేంద్రం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు చైనా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వారిలో ఒకరిని “పెలోడ్ స్పెషలిస్ట్”గా ఎంపిక చేసి, స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో చైనా వ్యోమగాములతో కలిసి పంపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మిషన్‌లో పాకిస్థాన్ వ్యోమగామి శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక ప్రదర్శనల్లో చైనా వ్యోమగాములకు సహకరించనున్నారు.
చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్ర ప్రతినిధి జాంగ్ జింగ్బో మాట్లాడుతూ, పాకిస్థాన్ అంతరిక్ష కేంద్రం ఎంపిక చేసిన ఇద్దరు వ్యోమగాములు ప్రస్తుతం చైనా వ్యోమగాములతో కలిసి కఠినమైన శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ మిషన్, రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారానికి కొత్త దశను తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, 2030 నాటికి చంద్రుడిపైకి తమ వ్యోమగామిని పంపేందుకు చైనా సిద్ధమవుతోందని కూడా జింగ్బో వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో చైనా ఈ భారీ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. ఈ మిషన్ ద్వారా చైనా అంతర్జాతీయ స్థాయిలో తన అంతరిక్ష సాంకేతికతను ప్రదర్శించబోతోంది. త్వరలోనే ఆ మిషన్‌లో పాల్గొనే వ్యోమగాముల బృందాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ ప్రకటనతో పాకిస్థాన్ కూడా అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా సహకారంతో పాక్ తన అంతరిక్ష సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇదొక పెద్ద అవకాశం అని భావిస్తున్నారు.
