పాకిస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా పౌరులపై తీవ్రమైన డిజిటల్ నిఘా నిర్వహిస్తోంది. ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం, పాక్ ప్రభుత్వం చైనా, జర్మనీ వంటి దేశాల్లోని ప్రైవేట్ కంపెనీల నుండి ఆధునిక నిఘా సాంకేతికతను సేకరించి, ఇంటర్నెట్ వాడకం, ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, లొకేషన్ డేటా తదితరాలను గోప్యంగా గమనిస్తోంది.
వెబ్ మానిటరింగ్ సిస్టమ్ (WMS 2.0) ద్వారా అనేక వెబ్‌సైట్లను బ్లాక్ చేయగా, లాఫుల్ ఇంటర్‌సెప్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LIMS) ద్వారా ప్రజల కమ్యూనికేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ టెక్నాలజీని జర్మనీకి చెందిన యుటిమాకో, యూఏఈకి చెందిన డేటాఫ్యూజన్ వంటి కంపెనీలు అందిస్తున్నాయి.
భద్రత పేరుతో నడిపే ఈ నిఘా అసలైన లక్ష్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అణచివేయడమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘించబడుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలు చేపట్టుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సోషల్ మీడియా యాప్‌లు, ప్రత్యేకించి ‘ఎక్స్’ (పూర్వం ట్విట్టర్) వంటి వాటిపై నిషేధం విధించగా, వీపీఎన్ వాడకాన్ని కూడా ఇస్లాం విరుద్ధమని ప్రకటించి ఆంక్షలు విధించారు. డేటా రక్షణ చట్టం లేకపోవడం వల్ల పౌరుల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని డిజిటల్ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ నిఘా చట్టవిరుద్ధమన్నదే న్యాయపరమైన స్థానం అయినా, నేటికీ ఈ కార్యక్రమాలు నిర్భందంగా కొనసాగుతుండడాన్ని మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. పార్లమెంట్, న్యాయవ్యవస్థ ఈ అక్రమ నిఘాను నిలువరించడంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించడమూ ఈ వ్యవహారంలో గంభీరతను చూపిస్తోంది.