ఈ పండగ సీజన్లో బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎగసిపడుతున్నాయి. విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుండటంతో, వినియోగదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి.
మేలిమి బంగారం (99.9% స్వచ్ఛత) ధర సోమవారం ఏకంగా రూ.2,700 పెరిగి తులానికి రూ.1,23,300కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర కూడా రూ.1,22,700కి చేరింది. ఇది మరో రికార్డు.
వెండి ధరలు కూడా ఇదే రీతిలో ఎగబాకాయి. కిలో వెండి రూ.7,400 పెరిగి రూ.1,57,400కి చేరింది. ఇది కూడా జీవితకాల గరిష్ఠం. అంతర్జాతీయంగా ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ధర $3,900 దాటి, సిల్వర్ ధర $48.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే గోల్డ్ 50% కంటే ఎక్కువగా పెరిగింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, త్వరలో ఔన్స్ గోల్డ్ $4,000 దాటే అవకాశముందని చెబుతున్నారు.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
- అమెరికాలో షట్‌డౌన్ వల్ల రాజకీయ, ఆర్థిక అనిశ్చితి పెరగడం
- డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత, రికార్డు కనిష్ఠానికి చేరుకోవడం
- ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు
- ఫ్రాన్స్, జపాన్ రాజకీయ పరిణామాలు
- బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం, ధరల మరింత పెరుగుదలకే దారితీస్తోంది. పండగల సమయంలో పెళ్లిళ్లు, ఆభరణాల కొనుగోళ్లతో బంగారానికి డిమాండ్ పెరుగుతుండటంతో ఇది ఒకింత ఆందోళనకరమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.