నెల్లూరు జిల్లా కందుకూరులోని కోవూరు రోడ్డులో దసరా సందర్భంగా మామూల్లు ఇవ్వలేదనే కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా నర్సుపై ట్రాన్స్‌జెండర్లు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల ప్రకారం, ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు మద్యం మత్తులో ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ప్రవేశించి, విధుల్లో ఉన్న నర్సు వద్దకు వెళ్లి దసరా పండుగ సందర్భంగా మామూలు డిమాండ్ చేశారు. నర్సు తన స్ధాయికి తగ్గట్టు కొంత మొత్తం ఇచ్చినా, అది సరిపోదని ఫిర్యాదు చేస్తూ వారు రెచ్చిపోయారు. అనంతరం అసభ్య పదజాలంతో దూషిస్తూ నర్సు జుట్టు పట్టుకొని లాగారు. ఆమెపై శారీరక దాడికి దిగుతూ బట్టలు చించేయడం వరకు వెళ్లారు. ఇది ఆసుపత్రి సిబ్బందిని, అక్కడ ఉన్న రోగులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
ఈ దాడి మొత్తం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకొని ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు, మహిళా సంఘాలు, స్థానికులు ట్రాన్స్‌జెండర్ల అమానుష ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండానే నర్సుపై ఇలా దాడి చేయడం అత్యంత దారుణమని పేర్కొంటున్నారు. ఇటువంటి ఘటనలు మహిళల భద్రతపై పెరుగుతున్న ప్రమాదాలను తెలియజేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇటీవలి కాలంలో ట్రాన్స్‌జెండర్ల మామూల్ల దందా, మద్యం మత్తులో చేసే అల్లర్లు, అసభ్య ప్రవర్తన మితిమీరిపోతున్నాయని పలువురు స్థానికులు వాపోతున్నారు. మానవత్వాన్ని విస్మరించిన ఈ చర్యలపై ప్రభుత్వం గట్టిగా స్పందించాలని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నర్సు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ ఘటన ఆమె మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసినట్లు సమాచారం.
ఈ కేసు ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్, ఆసుపత్రి సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత నర్సుకు మద్దతుగా పలువురు మహిళా సంఘాలు ముందుకు వస్తూ న్యాయం చేయాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Tags: