నారాయణఖేడ్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పైళ్ల కృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ కార్యకర్తలు, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సభలో ప్రసంగించిన బీజేపీ నేతలు, రాబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ, అదే తరహాలో తెలంగాణలోనూ విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీదే ఆధిపత్యమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు మాట్లాడుతూ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని, ప్రజలు క్రమంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, జిల్లా నాయకులు శేరికర్, అరుణ్ రాజ్, మారుతీ రెడ్డి, సాయిరాం, నారాయణఖేడ్ మండల అధ్యక్షులు సిందోల్ దశరథ్ కురుమ, రాజశేఖర్ గౌడ్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			