నంద్యాలలో ఒక కూతురు తండ్రి అపార్థం కారణంగా ఆత్మహత్య. ‘నేను తప్పు చేయలేదు’ అని లేఖ

నేను ఏ త‌ప్ప చేయ‌లేదు నాన్న‌.. నువ్వే నమ్మకపోతే ఎలా.. అంటూ ఓ కూతురు త‌న తండ్రికి లేఖ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయిందామె. నాన్న దృష్టిలో దోషిగా నిలబడడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకుంది. త‌న‌ గురించి అన్నీ తెలిసిన నాన్నే త‌న‌ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు అంటూ బాధతో ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జ‌రిగింది. 

అస‌లేం జ‌రిగిందంటే..
నంద్యాల జిల్లా డోన్‌ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరిలో పెద్దమ్మాయి రేణుక (22). ఆమె మాచర్లలోని న్యూటన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్ రెండో సంవ‌త్స‌రం చదువుతోంది. 

స్థానికంగా ఉండే క‌ళాశాల వ‌స‌తిగృహంలో ఉంటోంది. ఈ క్ర‌మంలో తోటి విద్యార్థి ఒక‌రు ఆమెకు ఫోన్‌ చేశాడు. కానీ బిజీగా ఉండ‌డంతో అత‌ని ఫోన్ కాల్‌కు ఆమె స్పందించ‌లేదు. దాంతో కంగారుపడిన సదరు విద్యార్థి నేరుగా రేణుక తండ్రికి ఫోన్‌ చేసి వాకాబు చేశాడు. 

ఆ ఫోన్ కాల్ త‌ర్వాత రేణుక తండ్రి ఆగ్రహానికి గుర‌య్యాడు. వెంట‌నే కూతురికి ఫోన్‌ చేసి గట్టిగా మందలించాడు. కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి? అతను నీకు ఎందుకు కాల్‌ చేస్తున్నాడు? అస‌లేం జ‌రుగుతోంది అన్నది క‌ళాశాల‌కు వచ్చి తేలుస్తానంటూ ఆమెను భ‌య‌పెట్టాడు. 

రేణుక ఎంత చెప్పినా తండ్రి వినిపించుకోలేదు. సోమవారం తెల్లారేసరికి కాలేజీకి వస్తానని చెప్పడంతో రేణుక భయపడిపోయింది. తండ్రి వస్తే తోటి విద్యార్థుల ముందు తాను చుల‌క‌న అవుతాన‌ని ఆమె ఆందోళ‌న‌కు గుర‌యింది. తాను చనిపోతేనే ఈ సమస్య తీరుతుందని భావించింది. 

తాను ఏ తప్పు చేయలేదని తండ్రికి ఉత్తరం రాసింది రేణుక‌. “నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నువ్వే నా ధైర్యం. అలాంటి నువ్వే నన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారు. ఆ అన్న తప్పేమీ లేదు.. అతను నన్ను అమ్మలా భావిస్తాడు” అని రేణుక ఆ లేఖలో రాసుకొచ్చింది. సూసైడ్ నోట్ రాసిన త‌ర్వాత వ‌స‌తి గృహంలోని ఓ రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌తో ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *