బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తమ కూతురు ‘దువా’ను అభిమానులకు పరిచయం చేశారు. తొలిసారి బిడ్డ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పాప చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు ‘దువా’ అని పేరు పెట్టినట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పటి వరకు తమ కూతురి ఫోటోలను లేదా వీడియోలను ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇతర ప్రముఖుల మాదిరిగానే వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ “నో ఫోటో పాలసీ”ని కఠినంగా పాటించారు.
ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో దీపికా తన కూతురుతో కలిసి ఉన్నప్పుడు మీడియా వీడియో తీసే ప్రయత్నం చేయగా, ఆమె అసహనం వ్యక్తం చేసింది. పిల్ల ప్రైవసీని గౌరవించాలని కోరుతూ, ఇప్పటికే రికార్డ్ చేసిన వీడియోను తొలగించమని సిబ్బందిని కోరిన సంఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
అయితే ఈసారి దీపావళి పండుగను పురస్కరించుకొని, ఈ జంట కుటుంబ ఫొటోను పంచుకోవడంతో పాటు దువా ఫేస్ రివీల్ చేశారు. బంగారు రంగు ఎథ్నిక్ డ్రెస్సుల్లో తల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ కనిపించిన ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.