దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. పండుగ ఉత్సాహం, డ్రై డే ప్రభావం కలసి వినియోగదారులు భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా, కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో ఒకే రోజులో జరిగిన అత్యధిక మద్యం కొనుగోలు రికార్డు. వెంటనే అక్టోబర్ 1న మరో రూ. 86 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 26 నుంచే పండుగ సీజన్ ప్రారంభం కావడంతో, మద్యం అమ్మకాలు రెట్టింపు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించడంతో, మందుబాబులు ముందురోజే భారీ ఎత్తున మద్యం నిల్వ చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్ షాపులు, లిక్కర్ మార్ట్‌లు, బార్లు బారులుగా జనంతో కిక్కిరిసిపోయాయి. పలుచోట్ల మద్యం కోసం ప్రజలు క్యూలలో నిలబడిన దృశ్యాలు కనిపించాయి.
పండుగ వేళ ప్రజలు కుటుంబం, స్నేహితులతో సంబరాలు జరుపుకునే క్రమంలో మద్యం వినియోగం విపరీతంగా పెరగడం సహజమే అయినప్పటికీ, గాంధీ జయంతి డ్రై డే కారణంగా ఈసారి కొనుగోళ్లు మరింతగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ విశ్లేషిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే దీపావళి, నూతన సంవత్సర వేళల్లో కూడా ఇలాంటి భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది.