దగ్గు మందు మరణాలపై సీబీఐ విచారణ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు


మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మొదట ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేసు పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, “పిటిషనర్లు పత్రికల్లో వచ్చిన వార్తలు చదివి వెంటనే కోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.

మెహతా ఇంకా పేర్కొంటూ, “తాను ఏ రాష్ట్రానికీ ప్రాతినిథ్యం వహించడం లేదుగానీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఈ ఘటనలపై ఇప్పటికే తీవ్రమైన చర్యలు తీసుకున్నాయి. డ్రగ్ నియంత్రణ చట్టాల అమలుకు తగిన వ్యవస్థలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయనీ, వాటిని విస్మరించరాదని” అన్నారు.

దీనిపై ధర్మాసనం పిటిషనర్ విశాల్ తివారిని ప్రశ్నిస్తూ, ఇప్పటి వరకు ఎన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారో అడిగింది. దానికి తివారి “8 నుంచి 10 PILలు దాఖలు చేశాను” అని సమాధానం ఇవ్వగా, ధర్మాసనం “కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు” అంటూ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

తన వ్యాజ్యంలో విశాల్ తివారి, “నాసిరకం మందులు మార్కెట్‌కు చేరకుండా ముందుగా నాణ్యతా పరీక్ష వ్యవస్థల్లోని లోపాలను సీబీఐతో దర్యాప్తు చేయించాలి. డ్రగ్ ఎగుమతులు లేదా అమ్మకాలకి అనుమతి ఇచ్చే ముందు, ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో టాక్సికాలజీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి” అని కోరారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను తిరస్కరించింది.

ఈ తీర్పుతో కోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలే డ్రగ్ నాణ్యతా పరీక్షలు, నియంత్రణ వ్యవస్థల అమలు బాధ్యత వహించాలనే స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *