తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు ప్రతియేటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 30వ తేదీన ముగుస్తాయి. ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ గౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజూ ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం
రూ.12 కోట్ల నిధులను కేటాయించింది. ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున నిధులు అందించింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో ఈ నెల 21వ తేదీన బతుకమ్మ సంబురాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేలా జీహెచ్‌ఎంసీ ఈ సంబురాలను నిర్వహించనున్నది.
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో వున్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ప్రకారం ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘‘బతుకమ్మా’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో వుంది. ధర్మాంగధుడు అనే రాజుకు సుమారు 100 మందకి పైగా కొడుకులు పుట్టి చనిపోతారు. దీంతో దుఃఖంలో మునిగిపోయిన ధర్మాంగధుడు అనే రాజు దంపతులు తమ కడుపున సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. ఆ దంపతుల మొరను ఆలకించిన మహాతల్లి ఆ రాజు దంపతులకు జన్మిస్తుంది. అప్పుడు పుట్టిన ఆ బిడ్డను దీవించేందుకు రాజు నివాసానికి విచ్చేసిన మునులు ‘నువ్వు కలకాలం బతుకమ్మ’ అని ఆమెను దీవించినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తూ వుంటుంది. ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం వుంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం వుందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం వుంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా వుంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా వుంటుంది. చెరువులన్నీ తాజా నీటితో నిండి వుంటాయి. అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి. వీటిలో గునుక, తంగేడి పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. ప్రకృతి రమణీయతతోపాటు రైతులకు కూడా సంతృప్తికరంగా వుండే వాతావరణం తెలంగాణ అంతటా వుంటుంది. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
బతుకమ్మ అంటే సంబరమే సంబరం… బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడపడుచులు.. పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రకృతి సౌందర్యమైన పూలనే గౌరీ దేవిని అమ్మవారిగా కొలుస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా, అత్యంత వైభవంగా ఆడపడచులు జరుపుకుంటారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే అందమైన పువ్వులతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా 9 రకాల పూలు.. గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, సీతజడ పూలు వంటి వాటిని స్థూపాకారంలో వరుసలుగా అమర్చి పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా భావిస్తారు. పూలతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా భావించే బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక బతుకమ్మ పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా .. మాకు బతుకునీయవమ్మా అని ఆటపాటలతో అమ్మవారిని వేడుకుంటారు.

పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మని బయటకి తీసుకువచ్చి.. ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. గౌరి దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని, వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ పండుగ వేడుకలు తొలి రోజు మహాలయ అమావాస్య రోజు నుంచి మొదలవుతుంది. తెలంగాణలో దీనినే పెత్రామస అని కూడా అంటారు. ఈరోజున బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంపుకొచ్చి వాడిపోకుండా నీళ్లలో వేసి మరుసటి రోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే ఎంగిలిపువ్వు అంటారని చెబుతారు.
భక్తులు మొదటి రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసి.. ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారని కొందరు చెబుతారు. ఆరోజున వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు బియ్యంతో కలిపి నువ్వులు, బియ్యం పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతి, అడవి గడ్డి పూలతో రెండు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకుల బతుకమ్మ పండుగ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసం మూడో రోజున బతుకమ్మను మూడంతరాల్లో చామంతి పూలు, మందార పూలు, సీతమ్మ జడ, రామబాణం పూలు పేర్చి తామర పాత్రల్లో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు.

బతుకమ్మ శిఖరంపైన గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా 4 రోడ్ల కూడలిలో ఆడవారందరూ కలిసి ఆడుకొని చెరువులో వేసి వస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలోని 4వ రోజు బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు తంగేడు పూలు, గునుగు పూలతో నాలుగంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరంపైన గౌరమ్మను పెడతారు. ఈరోజున నాన బెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. అశ్వయుజ మాసంలో 5వ రోజు అట్ల బతుకమ్మను చేస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, మందార పూలు, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండెతో చేసిన దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.
బతుకమ్మ పండుగలో ఆరో రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు. అంటే ఈరోజు బతుకమ్మ అలకవోతుంది. ఈరోజున గౌరీ దేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఏమి తినరని అంటారు. అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు. ఆశ్వయుజ మాసంలో 7వ రోజు. ఈ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గులాబి పూలతో ఏడంతారాలుగా పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజున తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, గడ్డి పూలు, మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.

బతుకమ్మ పండుగలో చివరిరోజు. ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన.. చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను, గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు. ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలు అందరూ కలసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు. ఆశ్వయుజ మాసంలో అష్టమి రోజు అలాగే దుర్గాష్టమి మహా పర్వదినం నాడు వస్తుంది. ఈ రోజున బతుకమ్మకు 5 రకాల నైవేద్యాలు నివేదిస్తారు. వీటిలో పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటివి ఐదు రకాల నైవేద్యాలను బతుకమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజున దూర ప్రాంతాల్లోని అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, వదినా మరదళ్లు, చిన్నారులు, బంధువులు అంతా ఒకచోట చేరుతారు. మహిళలంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు. అనంతరం దగ్గర్లోని చెరువలో లేదా కుంటలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇందులో భాగంగా మక్క సత్తును ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు.
