తెలంగాణలో కుల సర్వే-2024 నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బలహీనవర్గాలకు సంబంధించి సహేతుకమైన సమాచారం లేకపోవడంతో, రిజర్వేషన్లు అమలు విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. 1931 తరువాత దేశవ్యాప్తంగా బలహీనవర్గాల గణన జరగలేదని, జనాభా లెక్కల్లోనూ వీరి వివరాలు పొందుపరచలేదని తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, తండాలో ఎన్యూమరేటర్లు ఇంటింటి సమాచారాన్ని పకడ్బందీగా సేకరించారని వివరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి, డేటా నమోదు కోసం 76,000 మంది ఆపరేటర్లు 36 రోజుల పాటు పని చేసినట్టు వెల్లడించారు.
ఈ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్లు వెచ్చించిందని, పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో నివేదికను ప్రవేశపెట్టామన్నారు. ఈ గణన ప్రక్రియ ద్వారా బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఈ నివేదిక రూపొందించేందుకు కృషి చేసిన అధికారులకు, ఎన్యూమరేటర్లకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ నివేదిక ప్రకారం బీసీల స్థితిగతులను బాగా అర్థం చేసుకుని వారికి మరింత మద్దతుగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
