తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉన్న మరో ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకునే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
