తిరుమలలో శాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు 16 రకాల అన్నప్రసాద వంటకాలను అందించనున్నారు. మాడవీధుల్లో వాహనసేవలు జరుగుతుండగా 45 నిమిషాల్లో 35,000 మంది భక్తులకు రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తులు దర్శనం వీక్షించేందుకు 36 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాల 9 రోజుల్లో 60 టన్నుల పుష్పాలను రూ.3.5 కోట్ల విలువతో శ్రీవారికి అలంకరించనున్నారు. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 229 కళాబృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయి. 3,500 మంది శ్రీవారి సేవకులు సేవ చేస్తారు. కొండపై ప్రతి 4 నిమిషాలకోసారి బస్సులు యాత్రికులను తరలిస్తాయి. భద్రత కోసం 3000 సీసీ కెమెరాలు, 2000 టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు క్షణక్షణం పర్యవేక్షణ చేస్తున్నారు.
వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. రోజూ 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి 100 మీటర్లకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెప్పుల సమస్య పరిష్కారానికి క్యూఆర్ కోడ్ ఆధారిత స్లిప్ వ్యవస్థను ప్రారంభించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాప్‌ను కూడా ప్రవేశపెట్టారు.
అనూహ్య రద్దీని అధిగమించేందుకు అదనపు వసతులు, కాటేజీలు, గదులు అందుబాటులో ఉంచారు. భక్తుల సమస్యలు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఉభయ దేవేరులతో మలయప్పస్వామి వారు 16 వాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తూ లక్షలాది భక్తులకు దర్శనం ఇస్తారు. టీవీ ప్రసారాల ద్వారా కోట్లాది మంది ఈ ఉత్సవాలను వీక్షించే అవకాశం పొందుతున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకత – దేశంలోనే తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను టీటీడీ ప్రారంభించడమే.