తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ ప్రారంభం – సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు


తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ బృందం తిరుమలకు చేరుకుని దర్యాప్తు చేపట్టింది.

సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం శ్రీవారి ఆలయ పరకామణి ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పరకామణి చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

ఈ ఘటన 2023 మార్చిలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీ అయినట్లు గుర్తించారు. ఈ కేసులో టీటీడీ ఉద్యోగి రవికుమార్ను పోలీసులు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరపలేదని, లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకొని అప్పటి పాలకవర్గం కేసును మూసివేసిందనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలై, విచారణలో పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తోంది. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సీఐడీ డీజీని కలిసి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *