తరచూ సినిమాలు చేసేవారు ఇప్పుడు నెమ్మదించిన హీరోలు – ఏడాదికి ఒక్క సినిమాకే పరిమితం


ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల నిర్మాణం చకచకా జరిగేది. నెలకు కొత్త సినిమా లాంచ్ అవుతూ, ఏడాదిలోనే కొంతమంది హీరోలు మూడు నాలుగు సినిమాలను పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ జోరు బాగా తగ్గిపోయింది. సీనియర్ స్టార్ హీరోలు మాత్రమే కాదు, మధ్యస్థాయి హీరోలు, యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయడం కనిపిస్తోంది.

గతంలో రవితేజ, నాని వంటి హీరోలు తమ స్పీడ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేస్తూ బిజీ షెడ్యూల్‌లో ఉండేవారు. అయితే, గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నాని ఉదాహరణకు తీసుకుంటే, 2023 తర్వాత ఆయన ఒక్క సినిమా “హై నానా”తో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మరో ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పటికీ, ఆయన ఫ్రీక్వెన్సీ గతంతో పోలిస్తే చాలా తగ్గింది.

ఇక శర్వానంద్ విషయానికొస్తే, “మనమే” సినిమా తర్వాత ఆయన మళ్లీ తెరపై కనిపించలేదు. ఈ గ్యాప్ ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా నిఖిల్ కూడా “స్పై” తర్వాత పెద్దగా సైలెంట్‌గానే ఉన్నాడు. ప్రస్తుతం “స్వయంభూ”తో తిరిగి బరిలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ, మధ్యలో వచ్చిన పెద్ద గ్యాప్ ఆయన స్పీడ్‌ను తగ్గించింది.

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కూడా “రంగబలి” తర్వాత చాలా విరామం తీసుకున్నాడు. “బ్యాడ్ బాయ్ కార్తీక్”తో రీఎంట్రీ ఇవ్వాలని యోచిస్తున్నాడు. సుధీర్ బాబు కూడా అదే తరహాలో ఉన్నాడు. “జటాధర” సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ థియేటర్లలో కనిపించనున్నాడు.

అఖిల్ అక్కినేని విషయానికి వస్తే, “ఏజెంట్” తర్వాత ఆయన నుంచి ఏ కొత్త సినిమా రాలేదు. ప్రస్తుతం “లెనిన్” పేరుతో ఒక కొత్త ప్రాజెక్టు ప్లానింగ్‌లో ఉన్నప్పటికీ, ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అలాగే “భజే వాయువేగం” తర్వాత కార్తికేయ కూడా పెద్దగా హడావిడి చేయడం లేదు.

ఇలా చూస్తే, ఏడాదికి మూడేసి సినిమాలు చేస్తూ ముందుకు సాగిన హీరోలు ఇప్పుడు ఒక్క సినిమాకే పరిమితం కావడం, ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తోంది. సినిమా పరిశ్రమలో బడ్జెట్‌లు పెరగడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ కాలం పట్టడం, క్వాలిటీపై ఫోకస్ పెరగడం వల్ల ఈ మార్పు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, ఈ నెమ్మదించిన స్పీడ్‌తో పోటీ ప్రపంచంలో నిలబడగలరా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రేక్షకులు మాత్రం తమ ఫేవరెట్ హీరోల్ని తరచుగా తెరపై చూడాలన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *