ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 19 లేదా 20న జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశానికి చేరుకున్న తర్వాత నిర్ణయం స్పష్టతకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల్లో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో 15 మందితో అధిష్టానం ఒక షార్ట్‌లిస్ట్ సిద్ధం చేసింది. వీరిలో 9 మందికి ముఖ్యమంత్రి, స్పీకర్, క్యాబినెట్ స్థానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ, సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
పూర్వాంచల్ వర్గానికి చెందిన నేత, సిక్కు లేదా మహిళ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని తాజా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.