ట్రంప్ 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళికకు మోదీ, నెతన్యాహు మద్దతు


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికే మార్గంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రణాళికకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మద్దతు ప్రకటించారు. గాజాలో నెలకొన్న భీకర పరిణామాలను నివారించి, పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాశ్వత శాంతికి మార్గం వేయడమే ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ట్రంప్ ప్లాన్‌ వివరాలు ఇలా ఉన్నాయి:
వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ప్రణాళికను అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రధాన అంశాలు:

  • హమాస్ ఒప్పుకుంటే 72 గంటల్లో బందీల విడుదల
  • గాజాలో తాత్కాలిక టెక్నోక్రాట్ ప్రభుత్వం ఏర్పాటు
  • ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అనే అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థ ఏర్పాటు, ఇందులో ట్రంప్‌తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సభ్యులుగా ఉండనున్నారు
  • శాంతికి కట్టుబడిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష, మిగతవారికి దేశవేతర నివాసం అవకాశాలు
  • ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా దళాల పర్యవేక్షణలో గాజా భద్రత నిర్వహణ

హమాస్‌కు హెచ్చరిక:
హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే తక్షణమే బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఇజ్రాయెల్‌కు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇదే విషయాన్ని నెతన్యాహు కూడా పునరుద్ఘాటించారు. హమాస్ ఒప్పుకోకపోతే తమ యుద్ధ లక్ష్యాలను పూర్తిగా సాధించే వరకు వెనక్కి తగ్గబోమని అన్నారు.

మోదీ స్పందన:
భారత ప్రధాని మోదీ, సోషల్ మీడియా వేదికగా ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటిస్తూ, ఇది పశ్చిమాసియా ప్రాంతానికి శాశ్వత శాంతి, భద్రతను తీసుకురావడంలో కీలకంగా నిలుస్తుందన్నారు. శాంతి కోసం ప్రపంచ దేశాలు ట్రంప్ ప్లాన్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రతిపాదనపై చుట్టుపక్కల దేశాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, గాజాలో మానవీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేయాలన్న వాదన మిన్నవుతోంది. హమాస్ స్పందనకు ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *