తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర వాతావరణం నెలకొల్పిన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఈ ఉదయం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ముందుగా బరిలోకి దిగారు.
వివరాల్లోకి వెళితే, స్వతంత్ర అభ్యర్థి పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయనతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు తేదీలు నిర్ణయిస్తుండగా, స్వతంత్రులు ముందుగానే నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
- అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా,
- బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది.
- బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరోసారి హాట్‌స్పాట్‌గా మారింది. మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రకారం నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఎన్నికలో యువ ఓటర్ల ప్రభావం, నగరాభివృద్ధి అంశాలు, స్థానిక సమస్యలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ తమ పూర్వ ఎమ్మెల్యే కుటుంబానికి సానుభూతి వేవ్‌పై ఆధారపడుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి హామీలతో బరిలోకి దిగుతోంది. ఇక బీజేపీ ఈ ఉపఎన్నిక ద్వారా నగరంలో తన పట్టు చూపించాలని కృషి చేస్తోంది.