తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరోసారి దేశవ్యాప్తంగా గర్వించదగిన గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిన్నతనపు సందేశాత్మక చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో ముచ్చటించిన సుకృతి వేణి ఉత్తమ బాలనటి గా ఎంపికై జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవడం విశేషం.
ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆమెకు అందజేశారు. ఢిల్లీని వేదికగా జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రధానోత్సవంలో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించనప్పటికీ, సుకృతి వేణికి మిగిలిన వారిలో ప్రత్యేక స్థానం దక్కింది.
రాష్ట్రపతి స్వయంగా తన ప్రసంగంలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని ప్రస్తావించడం, సుకృతి నటనను ప్రశంసించడం మామూలు విషయం కాదు. “ఓ చెట్టును కాపాడటానికి ఓ చిన్నారి చేసిన ప్రయత్నాన్ని ఈ సినిమాతో ఎంతో హృద్యంగా చూపించారు. ఇలాంటి కథలు సమాజానికి మార్గనిర్దేశకంగా ఉంటాయి” అంటూ రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పద్మావతి మల్లాది, నిర్మాతలుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, శేష సింధులు, మరియు సమర్పణగా తబితా సుకుమార్ ఉన్నారు. చిన్న కథ అయినా, లోతైన భావం, విలువైన సందేశంతో కూడిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకుంది. దేశీయంగా జాతీయ అవార్డుతో పాటు, ఈ చిత్రం గ్లోబల్ వేదికలపై కూడా తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచింది.
సుకృతి వేణి నటన ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. చిన్నారి వయస్సులోనే అంత బలమైన భావోద్వేగాలు వ్యక్తపరచడం, సహజ నటన కనబర్చడం ద్వారా ఆమె సినీ పరిశ్రమలోకి మరో ప్రతిభావంతురాలిగా పరిచయమయ్యింది. బాల నటిగా ఆమెకు లభించిన ఈ అవార్డు, ఆమెకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను తెరలేపే అవకాశముంది.
తెలుగు సినిమా తరం తరం మారుతున్నా, ఈ తరంలోని పసిపిల్లలు కూడా సినిమా గౌరవాన్ని ఎలా దక్కించగలరో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంతో నిరూపితమైంది. ఈ చిత్రం లాంటి ప్రయత్నాలు మరిన్ని వస్తే, బాలల లోకంలో ప్రకృతి పరిరక్షణపై చైతన్యం పెరగడమే కాక, భావి తరాలకు విలువలు బోధించే అవకాశముంది.