జపాన్‌లో అత్యవసర గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ రహిత ఆమోదం


జపాన్ ప్రభుత్వం మహిళల పునరుత్పత్తి ఆరోగ్య హక్కుల రక్షణ కోసం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు (మార్నింగ్-ఆఫ్టర్ పిల్) డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా ఫార్మసీల్లో విక్రయించడానికి ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయం మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, పునరుత్పత్తి హక్కుల సాధనలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో ఆస్కా ఫార్మాస్యూటికల్ తయారు చేస్తున్న ‘నార్లెవో’ పిల్ ఫార్మసీల్లో లభిస్తుంది. అయితే, దీనిని ‘గైడెన్స్ అవసరమైన మందు’గా గుర్తించి, కొనుగోలు సమయంలో ఫార్మసిస్ట్ సమక్షంలో మాత్రమే తీసుకోవాల్సిన షరతు విధించారు. ఈ పిల్ కోసం వయోపరిమితి లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. నిపుణుల ప్రకారం, అత్యవసరంగా, 72 గంటల్లోపు ఈ మాత్రను తీసుకుంటే గర్భం దాల్చకుండా 80 శాతం వరకు నిరోధించవచ్చు. ఇది అండం పూర్తిగా అభివృద్ధి చెందకుండా లేదా గర్భాశయంలో అంటుకోకుండా పని చేస్తుంది.

సాంప్రదాయ మరియు పితృస్వామ్య భావజాలం బలంగా ఉన్న జపాన్‌లో, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలపై ఆమోదం పొందడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో ఈ తరహా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ప్రిస్క్రిప్షన్ లేకుండా లభిస్తున్నప్పటికీ, జపాన్‌లో ఇన్నేళ్లుగా చర్చలు జరుగుతూ వచ్చాయి. 2017లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్యానెల్ మొదటగా ఈ అంశాన్ని పరిశీలించగా, బాధ్యతారహిత వినియోగం పెరుగుతుందని భావించి ఆమోదం ఇవ్వలేదు.

అయితే, మహిళా హక్కుల సంఘాలు, యువతులు, అత్యాచార బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం గతేడాది 145 ఫార్మసీల్లో ట్రయల్ ఆధారంగా ఈ పిల్ విక్రయానికి అనుమతించింది. ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఆస్కా ఫార్మాస్యూటికల్ పూర్తిస్థాయి అనుమతికి దరఖాస్తు చేసి, తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నిర్ణయం ద్వారా జపాన్‌లో మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే, రక్షితమైన గర్భనిరోధక అవకాశాలు కల్పించబడుతున్నాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మహిళా ఆరోగ్య హక్కుల సాధనలో ఒక పెద్ద అడుగుగా పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *