జనగామ మండలం ఓబుల్ కేశవపురం గ్రామంలో కుల వివక్షత మరోసారి తలెత్తింది. గ్రామంలోని కుమ్మరి కులస్థులను ఓసీ కులాలకు చెందిన వ్యక్తులు సామాజికంగా బహిష్కరించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
దళితులకు సహాయం చేశారనే కారణంతో కుమ్మరి కులానికి చెందిన వారిని గ్రామంలో వేరుచేసినట్లు సమాచారం.
ఇటీవల గ్రామంలోని దళితుల వివాహాలకు కుండలు అందించినందుకు కుమ్మరి కులంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓసీ వర్గాలు, ఇకపై వారిని బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. గ్రామంలో ఎవ్వరూ కుమ్మరి కులస్థుల వద్ద కుండలు కొనకూడదని, ఎవరు తీసుకున్నా వారి కులాన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఇకపై గ్రామంలోని కార్యక్రమాల కోసం జనగామ పట్టణం నుండి మాత్రమే కుండలు తెప్పించుకోవాలని ఓసీ కుల సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ పరిణామంపై కుమ్మరి కులానికి చెందిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “గ్రామంలోని అన్ని కులాలు మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి” అని డీసీపీ రాజమహేంద్ర నాయక్ వద్ద ఫిర్యాదు చేశారు.
AlSO READ:AUS vs IND: క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం
దళిత వర్గాల వృత్తులను నిలిపివేయాలనే చర్చ కూడా గ్రామంలో చెలరేగింది. తమకు సహకరించే కులాలకే సహాయం చేస్తామని కొంతమంది దళితులు తీసుకున్న నిర్ణయం వివాదాన్ని మరింత పెంచింది.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరి సంఘాలు స్పందించాలని, ఏకత చూపాలని కుమ్మరి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకారపు మోహన్ పిలుపునిచ్చినట్లు సమాచారం.
