జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించబోతున్న ఈ జంట దురదృష్టవశాత్తూ విషాదాంతం పాలయ్యింది.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్త సంతోష్‌తో కలిసి పుట్టింటికి వెళ్లింది. అయితే ఆ రాత్రి భోజనం సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి అత్తగారింటికి చేరుకున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో వారంతా నిద్రలో ఉండగా గంగోత్రి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. గంగోత్రి తల్లి శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో గొడవే తమ కుమార్తె ప్రాణాలు తీసుకునేందుకు కారణమై ఉంటుందని, అత్తింటిలో ఇంకేమైనా జరిగి ఉండవచ్చని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకోవడం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.