చైనాలో అధికారంలో ఎంత ఉన్నత పదవిలో ఉన్నవారైనా, భయభయంగా జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. జిన్‌పింగ్ పాలనలో రహస్యంగా అధికారులను అదృశ్యం చేయడం, వారిపై అణచివేతలు సామాన్యమైన విషయంగా మారిపోయాయి. నిన్నటి దాకా అధ్యక్షుడికి దగ్గరగా ఉన్నవారూ, ఒక్కసారిగా కనిపించకుండా పోతుండటం అక్కడి అధికార యంత్రాంగంలో భయాన్ని కలుగజేస్తోంది.
ఇలాంటి సమయంలో, అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని యత్నిస్తోంది. చైనా అధికారుల కోసం మాండరిన్‌లో ప్రత్యేక వీడియోలు రూపొందించి “మా వైపు రండి, మాతో పనిచేయండి” అంటూ ఆహ్వానిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియోలు కేవలం గంటల వ్యవధిలోనే లక్షల మంది చూసారు.
ఈ వీడియోల్లో జిన్‌పింగ్ తీసుకున్న అవినీతి వ్యతిరేక చర్యల్ని సినిమాటిక్ స్టైల్‌లో చూపించారు. “నా భవిష్యత్తు నాది కావాలంటే, సీఐఏలో చేరాలి” అనే క్యాప్షన్‌తో అమెరికా ఈ ప్రకటనలు విడుదల చేసింది. చైనా నుండి వచ్చే గూఢచర్య ముప్పును ఎదుర్కొనడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యమని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ తెలిపారు.
ఇది అంతటా చైనా-అమెరికా మధ్య మౌన యుద్ధం మళ్లీ ముదురుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా అధికారుల మధ్య భయం, అనిశ్చితిని వినియోగించుకుని అమెరికా కీలక సమాచారం సేకరించాలనే లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇది చైనాలో రాజకీయ అస్థిరతను మరింతగా రెచ్చగొట్టే అవకాశం ఉంది.
