చిత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మురకంబట్టు టౌన్ పార్క్‌లో ఓ బాలికపై ముగ్గురు నిందితులు దారుణానికి పాల్పడగా, పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు.
నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని బేడీలు వేసి, చెప్పులు తీయించి, ప్రజలకు కనిపించేలా స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు కిలోమీటరు మేర నడిపించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని ఈ నెల 17 వరకు రిమాండ్‌కు పంపారు.
వివరాల్లోకి వెళ్తే, గత నెల 25న మురకంబట్టు పార్క్‌లో ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా, అక్కడికి మహేశ్, కిశోర్, హేమంత్ ప్రసాద్‌లు చేరుకున్నారు. మొదట మహేశ్ తన మొబైల్‌లో ఆ యువతిని వీడియో తీశాడు. తరువాత బాలిక స్నేహితుడిని బంధించి, ముగ్గురు క్రమంగా ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలిక స్నేహితుడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడా లాక్కుని పరారయ్యారు.
ఈ ఘటన జరిగిన రోజే బాధితులు పోలీసులను సంప్రదించలేదు. అయితే 29న పార్క్ వద్ద బాధిత యువకుడు, అతని స్నేహితులు, బంధువులు నిందితులను గుర్తించి దేహశుద్ధి చేశారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత బాలికపై అత్యాచారం జరిగిందని ధృవీకరించడంతో ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి పోక్సో కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కదిలాయి. రాష్ట్రవ్యాప్తంగా, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి చిత్తూరు నగర శివారులోని చెన్నమగుడిపల్లె వద్ద నిందితులను పట్టుకున్నారు.
డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిందితులకు నేర చరిత్ర ఉందని, గతంలోనూ ఒంటరిగా ఉన్న ప్రేమజంటల వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేశారని తెలిపారు. వారి ఫోన్లలో ఇలాంటి నాలుగైదు వీడియోలు దొరికాయని చెప్పారు. బాధితులు ఎవరైనా ముందుకు వస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి కేసులు నమోదు చేసి నిందితులను శిక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
ఈ ఘటనతో చిత్తూరు జిల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, బాలికకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.