గుంటూరులో నకిలీ నోట్ల చెలామణీ మరోసారి కలకలం రేపింది. తాజాగా పట్టాభిపురం ప్రాంతంలో జరిగిన ఘటనలో దంపతులు గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లతో వ్యాపారులను మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నగరంలోని రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలోని చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు.
మొదట వారు ఒక తోపుడు బండిపై శనక్కాయలు కొనుగోలు చేస్తూ 100 రూపాయల వస్తువుకు 500 రూపాయల నకిలీ నోటు ఇచ్చి, మిగిలిన 400 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న బెంగుళూరు అయ్యంగారి బేకరీకి వెళ్లి కూల్‌డ్రింక్ కొనుగోలు చేశారు. అక్కడ కూడా 500 రూపాయల నకిలీ నోటు ఇచ్చారు. అయితే ఈసారి బేకరీ వ్యాపారి నోటు పలుచగా ఉందని గమనించి అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే ఆయన కేకలు వేయడంతో, గోపిరెడ్డి, జ్యోతి నకిలీ నోటు వెనక్కి తీసుకుని 100 రూపాయలు ఇచ్చి హడావుడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అక్కడి ప్రజలు అప్రమత్తమై వారిని ఆపారు. పరిస్థితిని తారుమారు చేయడానికి గోపిరెడ్డి, “మా సోదరుడు రామిరెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు” అంటూ బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గోపిరెడ్డి, జ్యోతి హైదరాబాద్‌లో కన్సల్టెన్సీ నడుపుతున్నట్టు చెప్పి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ దంపతుల వద్ద ఉన్న ద్విచక్రవాహనం దగ్గర పార్క్ చేసిన బ్యాగ్‌ను ముఠాలోని మరో వ్యక్తి తీసుకుని పరారయ్యాడు. దీంతో పోలీసులు మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం గోపిరెడ్డి ఇంటిని సోదా చేసిన అధికారులు, అనుమానాస్పద సమాధానాలు చెబుతున్న కారణంగా వారిని కస్టడీలోకి తీసుకుని మరింతగా విచారిస్తున్నారు.
ఇదే సమయంలో, గత రెండు నెలలుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ నకిలీ నోట్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. జూన్ నెలలో ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో పినిశెట్టి చక్రధర్ అనే వ్యక్తి SBI బ్రాంచ్‌లోని కాష్ డిపాజిట్ మిషన్‌లో 83 నకిలీ 500 రూపాయల నోట్లను జమ చేయడానికి ప్రయత్నించాడు. అవి నకిలీవని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు చక్రధర్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొత్తం 838 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల పోలీసులు దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.65 లక్షల విలువైన నకిలీ నోట్లను పట్టుకున్నారు.
ఈ వరుస ఘటనలు నకిలీ నోట్ల ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా ఉన్నాయనే అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, నోట్లను స్వీకరించే సమయంలో జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. చిన్న వ్యాపారులు, పల్లె ప్రాంతాల్లోని దుకాణదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కేసు గుంటూరులో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నకిలీ నోట్ల ముఠాలపై పోలీసుల దృష్టి సారించేలా చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, స్వాధీనం జరుగుతాయని సమాచారం.