గుంటూరు నగరంలో డయేరియా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ (గుంటూరు కార్పొరేషన్) అత్యవసర చర్యలకు దిగింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తికి కారణమని భావిస్తున్న కలుషిత ఆహారం, నీటి వనరులను నియంత్రించేందుకు పానీపూరీ అమ్మకాలు, టిఫిన్ బండ్లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో డయేరియా ప్రబలినట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి, సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని, కలుషిత నీటి వనరులను గుర్తించి తక్షణం సరిదిద్దాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట క్లోరినేషన్ ప్రక్రియను పెంచాలని, కాలువలు, డ్రెయినేజ్ లైన్లను శుభ్రం చేయాలని కమిషనర్ ఆదేశించారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వైద్య సహాయం వెంటనే అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు.
కలుషిత ఆహారం, వీధి భోజన పదార్థాలే వ్యాధి ప్రధాన కారణమని భావిస్తున్నందున, పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరిగిన నీరు మాత్రమే తాగాలని, బయట ఆహారం తీసుకోవడం నివారించాలని వైద్యులు సూచించారు.
ఈ పరిణామంతో గుంటూరు నగరంలో ప్రజల ఆందోళన పెరుగుతున్నా, కార్పొరేషన్ తీసుకున్న కఠిన చర్యల వల్ల వ్యాధి త్వరలోనే అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు నమ్ముతున్నారు.