ఇటీవల జరిగిన రెట్రో ఆడియో లాంచ్ ఈవెంట్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన “ట్రైబల్స్ లాగా కొట్టుకోవడం ఏంటి?” అనే వ్యాఖ్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని ఆదివాసీ సంఘాలు, నాయకులు మండిపడ్డారు. తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ విజయ్‌ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందించారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించాయనే విషయం తెలుసుకుని ఆయన విచారం వ్యక్తం చేశారు. గిరిజనులపై తనకు అపార గౌరవం ఉందని, అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. “భారత ప్రజలు ఎలా ఐక్యంగా ముందుకు సాగాలోనే నేను మాట్లాడాను, ఇతర ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు.
వివరణలో విజయ్ ట్రైబల్స్ అనే పదాన్ని వేరే అర్థంలో వాడినట్లు తెలిపారు. “హిస్టారికల్ మరియు డిక్షనరీ ప్రాసెప్ట్‌లోనే నేను ఆ పదాన్ని ఉపయోగించాను. పూర్వకాలంలో ప్రజలు గుంపులుగా ఉండేవారు, అప్పట్లో తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. నేను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను ఉద్దేశించలేదు” అని తెలిపారు.
అంతేకాక, బ్రిటిష్ పాలన తర్వాతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వంటి వర్గీకరణలు ఏర్పడ్డాయని, అది ఇప్పటికీ సరిగ్గా 100 సంవత్సరాలు కూడా కాలేదని వివరించారు. “నేను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. ఎవరైనా నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డారంటే నిజంగా బాధగా ఉంది. మనందరం ఒక్కటే, శాంతి, ఐక్యతే నా లక్ష్యం” అని విజయ్ దేవరకొండ తన ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
