పంజాబ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఒక భయానక ఘటనలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్‌సర్ నుంచి సహర్సా వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (Train No.12204) రైలు సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాంతంలోకి చేరుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు అంబాలా నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే అలారం మోగించారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పొగలు చుట్టుముట్టడంతో ప్రయాణికులు భయాందోళనతో రైలులో నుంచి బయటకు దూకి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మూడు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రయాణికులందరినీ సకాలంలో రైలులో నుంచి బయటకు దించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ రతన్ లాల్ తెలిపారు — “సిబ్బంది వేగవంతమైన స్పందన వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. మంటల్లో మూడు బోగీలు కాలిపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.” అని వివరించారు.
రైల్వే అధికారులు మాట్లాడుతూ, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, సాంకేతిక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆ రూట్‌లో కొద్ది సేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా పంపించారు.
ఈ సంఘటన రైల్వే భద్రతపై మరోసారి ఆందోళనలు రేపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే అధికారులు సిబ్బందికి అదనపు భద్రతా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం.