ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర గత సంవత్సరం జూన్ 30న లాస్ ఏంజిల్స్ నుంచి కొలంబో వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పూర్తి శాకాహారిగా ఉండే జయవీర, ప్రయాణానికి ముందుగానే వెజిటేరియన్ భోజనం ఆర్డర్ చేశారు. అయితే విమాన సిబ్బంది ఆయనకు ఆ భోజనం అందుబాటులో లేదని తెలుపుతూ, బదులుగా మాంసాహార భోజనం అందించారు. అందులోని మాంసం ముక్కలను పక్కన పెట్టి మిగతా భాగం తినమని సూచించారు. వృద్ధుడు ఆహారం తినే సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక స్పృహ కోల్పోయారు.
వెంటనే విమాన సిబ్బంది స్పందించి అత్యవసర చికిత్స ప్రారంభించినా, పరిస్థితి విషమించింది. విమానం అత్యవసరంగా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ లో ల్యాండ్ చేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆస్పిరేషన్ న్యుమోనియాతో కొద్ది రోజుల తర్వాత మరణించారు.
ఈ ఘటనపై ఆయన కుమారుడు సూర్య జయవీర ఖతార్ ఎయిర్‌వేస్‌పై ‘రాంగ్‌ఫుల్ డెత్’ కేసు వేశారు. భోజనం అందించడంలో నిర్లక్ష్యం, వైద్య సహాయం ఆలస్యంగా అందించడమే తండ్రి ప్రాణాలకు కారణమని పేర్కొన్నారు. మాంట్రియల్ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం 1.28 లక్షల అమెరికన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ అమెరికా కోర్టులో దావా వేశారు.
ఈ ఘటనతో అంతర్జాతీయ విమానయాన రంగంలో ప్రయాణికుల ఆహార నియమాలపై మరలా చర్చ మొదలైంది. ప్రయాణికుల ఆహార అలవాట్లు, అలర్జీలు, ప్రత్యేక ఆహార అభ్యర్థనలు వంటి అంశాలను ఎయిర్‌లైన్స్ ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నాయన్నదిపై ప్రశ్నలు లేవుతున్నాయి. గతంలో కూడా ఖతార్ ఎయిర్‌వేస్‌లో వేరుశనగల అలర్జీ ఉన్న ప్రయాణికుడికి అలాంటి ఆహారం వడ్డించడంతో వివాదం చెలరేగింది.
ప్రస్తుతం, ఈ కేసు విచారణలో ఉండగా, విమానయాన సంస్థల బాధ్యతలపై అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన చర్చ జరుగుతోంది.