విశాఖపట్నం క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి నగరానికి ఖ్యాతి తీసుకురావాలని మిలీనియం స్టార్, ప్రముఖ సంఘసేవకులు కంచర్ల ఉపేంద్రబాబు ఆకాంక్షించారు. యువత క్రికెట్‌లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. క్రిష్ణా కాలేజ్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని విజేతలకు ఉపకార్ ట్రస్ట్ తరఫున రూ.80 వేల నగదు బహూకరించారు.
ఆంధ్ర యూనివర్సిటీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ పోటీ ఉత్కంఠ భరితంగా జరిగింది. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని ఉపేంద్రబాబు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని యువతను కోరారు.
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ నిరంతరం క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల ఆధ్వర్యంలో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విశాఖ యువత కోసం మరిన్ని క్రీడా అవకాశాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
గెలుపొందిన ఆన్‌లైన్ వారియర్స్ జట్టుకు ట్రోఫీలు, చెక్కులు అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును బల్లూ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ప్రతినిధులు నాగు, పలువురు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా ప్రోత్సాహానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఉపేంద్రబాబు తెలిపారు.