తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికలైనా గెలుపు తామిదే అనే ధీమాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ సన్నద్ధతను ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు “బాకీ కార్డులు” ప్రవేశపెట్టామని వివరించారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “ఒకవైపు ఎన్నికల ముందు ‘గ్యారెంటీ కార్డులు’ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం ప్రజలను మోసం చేసింది. వారు చెప్పిన అభయహస్తం కాస్తా భస్మాసుర హస్తం అయింది. ఈ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు, ప్రతి వర్గానికీ బాకీగా ఉన్న అంశాలను చూపించేందుకు ‘బాకీ కార్డులు’ను విడుదల చేశాం” అని చెప్పారు.
అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ, “ఇప్పటి హైదరాబాద్‌ను పట్టించుకోవడం లేదు. కొత్త నగరం నిర్మిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు” అని పేర్కొన్నారు.
కేటీఆర్ స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే – రాష్ట్రంలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తమ నాయకుడు కేసీఆర్ పాలనపై నమ్మకం ఇప్పటికీ ఉన్నదని. రాజకీయ పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారుతున్నాయని, ప్రజలు గతంలో పొందిన అభివృద్ధిని మళ్లీ కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ ఎన్నికలు వచ్చినా తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని, తగిన సమయానికి తగిన వ్యూహాలతో బీఆర్ఎస్ బరిలో దిగుతుందని స్పష్టం చేశారు.