కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం చింతరపాలెం గ్రామానికి చెందిన కోకిలమ్మ, రామచంద్రప్ప దంపతులు ఆస్తి వివాదంలో చిత్రహింసలు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. తమ పినతండ్రి కుమారులతో భూ తగాదాలు నడుస్తున్నాయని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అక్రమంగా ఆస్తిని ఆక్రమించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.
మరో రెండు మూడు రోజుల్లో తమ కుమారుడి వివాహం జరగనున్న వేళ, ఇది అదనుగా భావించిన వ్యక్తులు ఇంటి చుట్టూ గుంతలు తవ్వించి త్రాగునీటి సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. మురుగునీరు పోవడానికి సైతం వీలు లేకుండా చేశారని, వారి కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామ పెద్దలు, పోలీసులను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యకు గ్రామ పెద్దలు, స్థానిక పోలీసులు మద్దతుగా లేకపోవడంతో బాధితులు కుప్పం రూరల్ సీఐని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సీఐ తగు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వివాహ వేళ ఇలాంటి వేధింపులకు గురవుతున్న తమకు పోలీసులే రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
తమ కుటుంబ సభ్యుల వల్లే ప్రాణహాని ఉన్నదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. వివాహం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 
				 
				
			 
				
			 
				
			