కల్తీ మద్యం కాళరాత్రి: బ్రాండెడ్ సీసాల్లో విషం, గ్రామాల్లో ప్రాణాలకు ముప్పు


రాష్ట్రంలో రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు చెలరేగుతుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ మద్యం రూపంలో ఒక భయంకరమైన ముప్పు ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియబోతుండటంతో, అధికారికంగా వైన్స్ షాపుల్లో మద్యం స్టాక్ నిల్వ లేకపోవడం, అక్రమ దందాలకు మార్గం సుగమం చేసింది. ఈ పరిస్థితుల్లో స్పిరిట్ కలిపిన నకిలీ మద్యం గ్రామాల్లోకి ఎర్ర ప్రవాహంలా చేరి ప్రజలను తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు పెద్ద ఎత్తున దాడులు చేసి కల్తీ మద్యం బహిర్గతం చేశాయి. సూర్యాపేట జిల్లాలో 870 లీటర్ల స్పిరిట్, 16 మంది అరెస్టు, నల్గొండ జిల్లాలో 1,500 లీటర్ల కల్తీ మద్యం, మహబూబాబాద్‌లో 2,688 సీసాలు, 60 లీటర్ల స్పిరిట్, ఆదిలాబాద్, జహీరాబాద్, సిద్దిపేట వరకు ఈ దందా విస్తరించింది. మూడు వేల లీటర్లకు పైగా నకిలీ మద్యం ధ్వంసం చేసిన ఘటన కూడా తాజాగానే చోటుచేసుకుంది.

కల్తీ మద్యాన్ని తాగడం వల్ల గ్రామాల్లో ప్రజలు కాలేయ సంబంధ వ్యాధులు, మూత్రపిండ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, ఇంతకుమించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద గండికొడుతోంది. బ్రాండెడ్ కంపెనీల ఖాళీ సీసాలు, లేబుళ్లు సేకరించి వాటిలో స్పిరిట్ కలిపిన విషం నింపి విక్రయించడం భయానక వాస్తవంగా బయటపడింది.

ఇలాంటి ఘటనలు పంజాబ్‌లో ఒకసారి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితి అదేపనిగా మారుతుందనే భయం ప్రజల్లో నెలకొంది. కల్తీ మద్యం వ్యాపారం పూర్తిగా నిర్మూలించాలంటే పోలీసు, ఆబ్కారీ శాఖలు విడివిడిగా కాకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ఈ దందాలో రాష్ట్రాల మధ్య ఉన్న స్పిరిట్ సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడం తప్పనిసరి.

మరోవైపు, రాజకీయ దృష్ట్యా గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి మద్యం వాడకం పెరుగుతుండటం కూడా ఈ అక్రమాలకు మరింత ప్రోత్సాహం ఇస్తోంది. నకిలీ మద్యం వ్యాపారులు ఈ ఎన్నికల వేడిని తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు రక్షించడానికి అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *