కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో భయాందోళన నెలకొనగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60కి పైగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 12 వాహనాలపై కేసులు నమోదు చేసి, 8 బస్సులను సీజ్ చేశారు. వీటిలో సరైన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం గుర్తించబడింది. సీజ్ చేసిన వాహనాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇక సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-3 వద్ద, రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద కూడా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సులను ఆపి వాహనాల భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలు, మెడికల్ కిట్ల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.
ఎల్బీనగర్‌లోని చింతలకుంట వద్ద కూడా పలు వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ, “ప్రయాణికుల ప్రాణభద్రత మాకు అత్యంత ప్రాధాన్యత. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు తప్పనిసరిగా ఉండాలి. నిబంధనలు పాటించని ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
ఈ ఆకస్మిక తనిఖీలతో నగరంలోని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంబేలెత్తారు. మరోవైపు ప్రజలు కూడా ఈ చర్యలను స్వాగతిస్తూ, రవాణా శాఖ ఈ డ్రైవ్‌ను నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.
