కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సినీ తారలు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఈ విషాదంపై తన తీవ్ర ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంటూ, “కర్నూలు బస్సు ప్రమాదం వార్త నా హృదయాన్ని కలచివేసింది. కాలిపోయే ముందు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికే భయంగా ఉంది. ఇది నిజంగా భయంకరం” అని రాశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆమె మరింతగా పేర్కొంటూ, “ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాల వెంట ఉన్నాయి. ఆ ప్రాణాలు కోల్పోయిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని రాశారు.
తెలుసుకున్న మేరకు, ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 46 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలామంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టడంతో, ప్రయాణికులు బయటకు రావడానికి కూడా అవకాశం లేకపోయింది. రాత్రివేళ చోటుచేసుకున్న ఈ దుర్ఘటన కర్నూలు జిల్లాలోనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది.
ప్రస్తుతం రష్మిక మందన్న పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, నెటిజన్లు కూడా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ప్రజలు రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిస్తున్నారు.
