కర్ణాటక విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాస్ కావడానికి కావాల్సిన కనీస మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు అవసరమవుతుండగా, ఇకపై 33 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రకటించారు. ఈ మార్పు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులను చదువు మధ్యలో ఆపకుండా ముందుకు తీసుకెళ్లడమే. “కేవలం ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురు చూడాలి. ఈ లోగా తల్లిదండ్రులు వాళ్లను పనికి పంపటం, లేదా ఆడపిల్లలైతే పెళ్లి చేసి పంపించడం జరుగుతోంది. ఇలా జరగకుండా చదువు కొనసాగించేందుకు వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి మధు బంగారప్ప వివరించారు.
ప్రస్తుతం ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలు 625 మొత్తం మార్కులకు నిర్వహించబడతాయి. కొత్త రూల్ ప్రకారం, ఈ పరీక్షల్లో 33 శాతం అంటే కనీసం 206 మార్కులు సాధిస్తే విద్యార్థులు పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. ఇది అన్ని సబ్జెక్టులకూ వర్తిస్తుంది.
ఈ కొత్త విధానం ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలలకు వర్తించనుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు, వారి భవిష్యత్‌కు అడ్డుకాలిగే పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఈ చర్య అవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉత్సాహాన్ని కలిగించే అంశమని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటీ అరా మార్కుల తేడాతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా, తగిన గడువు ఇచ్చి తదుపరి చదువుకు వేదిక కల్పించే మంచి నిర్ణయంగా ఇది భావించబడుతోంది.