ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానుల కోసం ఈ మెగా ఈవెంట్ రెండు నెలల పాటు రసవత్తరంగా సాగనుంది. ఇదే సందర్భంగా ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యంత వేగవంతమైన శతకాల జాబితాను పరిశీలిద్దాం. టాప్-10లో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం!
ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2013లో పూణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. రెండో స్థానంలో యూసుఫ్ పఠాన్ (2010) 37 బంతుల్లో సెంచరీ సాధించగా, మూడో స్థానంలో డేవిడ్ మిల్లర్ (2013) 38 బంతుల్లో శతకం చేశాడు.
టాప్-10 జాబితాలో నాలుగో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ నిలిచాడు. 2024 ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై 39 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. ఐదో స్థానంలో ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ 2024లో గుజరాత్ టైటాన్స్‌పై 41 బంతుల్లో సెంచరీ సాధించాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున 2008లో 42 బంతుల్లో శతకం చేసిన అడమ్ గిల్‌క్రిస్ట్ ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇక మిగిలిన ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ (43 బంతులు, 2016), డేవిడ్ వార్నర్ (43 బంతులు, 2017), సనత్ జయసూర్య (45 బంతులు, 2008), మయాంక్ అగర్వాల్ (45 బంతులు, 2020) టాప్-10లో నిలిచారు. 2024లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో కూడా కేకేఆర్‌పై 45 బంతుల్లో శతకం సాధించి ఈ జాబితాలో చోటు సంపాదించాడు.